మరో సర్జికల్‌ స్ట్రైక్‌ అవసరం… బిపిన్ రావత్..!

పాకిస్థాన్‌ తన ఆర్మీని, ఐఎస్‌ఐని అదుపులో పెట్టుకోలేకపోతే సరిహద్దుల వద్ద పరిస్థితులు సద్దుమణగవు. ఉగ్రవాదులు పోలీసులను లక్ష్యంగా చేసుకోవడం వారి అసహనాన్ని తెలుపుతోంది. ఉగ్రవాదులపై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌‌ అవసరం’ అని పాక్ కు వార్నింగ్ ఇచ్చారు భారత సైన్యాధిపతి జనరల్‌ బిపిన్ రావత్‌.

ఇటీవల కశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఓ బీఎస్‌ఎఫ్ జవాను గొంతును కోసి, చంపి పాకిస్థాన్‌ రేంజర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఇద్దరు పోలీసు అధికారులు, ఓ కానిస్టేబుల్‌ను అపహరించి దారుణంగా హత్య చేశారు. దీంతో ఈ విషయాలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు భారత ఆర్మీ ఇప్పటికే తేల్చిచెప్పింది.అమెరికాలోని న్యూయార్క్‌లో పాక్-ఇండియా మధ్య చర్చలు జరగాల్సి ఉండగా, కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులతో భారత్ వీటిని ఉపసంహరించుకుంది.

కాగా.. ‘‘పాకిస్తాన్‌తో శాంతి చర్చల్లో పాల్గొనేందుకు ఇండియా తిరస్కరించింది. కానీ, మేం తలుపులు మూయబోం” అంటూ స్పందించారు పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మహ్మూద్ ఖురేషి. భారత్‌తో చర్చల కోసం ఇస్లామాబాద్ తలుపులు తీసే ఉంటాయని, పాక్‌లో ఉన్న వారంతా ఉగ్రవాదులు కాదని ఆయన అన్నారు.