రాహుల్ కు పాక్ నేతల మద్దతు… బీజేపీ ఆరోపణ..!

మోదీ ప్రధానిగా కొనసాగాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ, పాక్‌ మాత్రం భారత ప్రధానిగా రాహుల్‌ గాంధీ ఉండాలని కోరుకుంటోందంటూ తీవ్ర విమర్శలు చేసారు భాజపా నేత సంబిత్‌ పాత్రా. ‘భారత్‌లో రాహుల్‌ గాంధీ గొప్ప నాయకుడు కావాలని కొందరు కోరుకుంటున్నారు. వారు ఎవరో కాదు.. పాకిస్థాన్‌ నాయకులే” అని అన్నారు. అవినీతి, వారసత్వ, బుజ్జగించే రాజకీయాలు చేసే వారికి పాక్ నేతలు మద్దతు పలుకుతున్నారు’ అని ఆయన ఆరోపించారు. మోదీ పట్ల పాకిస్థాన్‌ నాయకులు, కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. వారి లక్ష్యం ఒక్కటే.. మోదీని రాజకీయాల్లోంచి తొలగించడమే వారి ధ్యేయం’ అని సంబిత్‌ పాత్రా వ్యాఖ్యానించారు.

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో జరిగిన అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే మోదీ.. పాక్‌-భారత్‌ల మధ్య జరగాల్సిన చర్చలను రద్దు చేశారని నిన్న పాకిస్థాన్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని భారత రాజకీయాల్లోంచి తప్పించడమే పాకిస్థాన్‌, కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది.