మాల్యా మోసం చేయలేదు..!

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం వల్లే మాల్యా రుణాలను చెల్లించలేకపోయారు కానీ ఆయన బ్యాంకులకు మోసం చేయలేదన్నారు ఆయన తరఫు న్యాయవాదులు. దివాలా తీసిన పారిశ్రామిక వేత్త విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించే విషయమై… వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో వాదప్రతివాదనలు సాగాయి. మాల్యా ఆర్థిక మోసానికి పాల్పడ్డారంటూ భారత్‌ సమర్పించిన ఆధారాల్లో పసలేదని పేర్కొన్నారు. ‘‘సీబీఐపై ఒత్తిడి రావడం వల్లే మాల్యాకు వ్యతిరేకంగా ఆ దర్యాప్తు సంస్థ కేసుల్ని పెట్టింది. మాల్యాను ఉంచేందుకు సిద్ధంచేశామంటూ భారత్‌ పంపిన వీడియోను చూస్తే… గాలి, వెలుతురు ఆ గదిలోకి సరిగా రావని తెలుస్తోంది. అలాంటి వాతావరణంలోకి మాల్యాను పంపించడం ఆమోదయోగ్యం కాదు’’ అని ఆయన లాయర్లు వాదించారు.

కోర్టులో వాదనల అనంతరం మాల్యా మీడియా తో ‘‘మాకున్న రూ.13,900 కోట్ల విలువైన ఆస్తుల్ని విక్రయించి, ప్రభుత్వరంగ బ్యాంకులు సహా రుణదాతలందరి బకాయిల్ని చెల్లించేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరాం. బకాయిల విషయమై బ్యాంకులతో సమగ్ర పరిష్కారం కుదుర్చుకుంటామని గత జూన్‌ 22న యునైటెడ్‌ బ్రీవరీస్‌ గ్రూప్‌, నేనూ కర్ణాటక హైకోర్టుకు నివేదించాం. న్యాయమూర్తులు ఆ దిశగా నిర్ణయం చెబుతారని ఆశిస్తున్నా’’ అన్నారు.

కాగా.. భారత్‌ను విడిచి వెళ్లడానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని కలిసి, బ్యాంకు బకాయిల సమస్యను ‘సెటిల్‌’ చేసుకుంటానని, మాల్యా తనను కలిసినట్లు చెబుతున్నదాంట్లో నిజం లేదని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కొట్టిపారేశారు. 2014లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాల్యాకు తాను అపాయింట్‌మెంటే ఇవ్వలేదన్నారు.