నేడు మోదీ ట్రంప్ ల భేటీ

18

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని మోదీ నేడు భేటీ కానున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.45 గంటలకు వీరి భేటీ జరగనుంది. దాదాపు 40 నిమిషాలపాటు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులు, భారత్-అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలపై (సుంకాల తగ్గింపు) వీరు చర్చించనున్నారు. ఇరువురు నేతల సమావేశంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరోవైపు, జీ7 సదస్సులో డిజిటల్ రూపాంతరీకరణ, పర్యావరణం అంశాలపై మోదీ ప్రసంగించనున్నారు. 

ఫ్రాన్స్ లో జీ7 దేశాల సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కూటమిలో భారత్ కు సభ్యత్వం లేకపోయినప్పటికీ… ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్కాన్ వ్యక్తిగత ఆహ్వానంపై ట్రంప్ ఆ సదస్సులో ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్నారు. మరోవైపు, గతంలో ఈ కూటమి జీ8గా ఉండేది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, బ్రిటన్, కెనడాలు సభ్యదేశాలుగా ఉండేవి. అయితే, 2014లో ఈ గ్రూపు నుంచి రష్యాను బహిష్కరించడంతో జీ8 కాస్తా… జీ7 అయింది. తాజాగా, రష్యాను తిరిగి కూటమిలో కలుపుకోవడానికి జీ7 దేశాధినేతలు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.