పుల్వామా దాడికి పాకిస్థాన్‌ కారణం : శివసేన

12

ఆర్టికల్‌ 370 రద్దుపై పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను శివసేన తీవ్రంగా తప్పుపట్టింది. మోదీ ప్రభుత్వ నిర్ణయం మరిన్ని పుల్వామా తరహా ఘటనలకు దారితీస్తాయని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలే పుల్వామా దాడి వెనుక పాక్‌ హస్తం ఉందనేందుకు తిరుగులేని ఆధారమని  శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం రద్దుపై పాక్‌ నిర్ణయం ఆ దేశానికే నష్టమని స్పష్టం చేసింది.

పాక్‌ నిర్ణయం భారత వృద్ధి రేటుకు ఎంతమాత్రం అవరోధం కాదని పేర్కొంది. భారత రాయబారిని తిప్పిపంపడం, పాక్‌లో తమ రాయబారిని వెనక్కిపిలవడం వంటి పాక్‌ దౌత్య నిర్ణయాలను స్వాగతిస్తున్నామని పేర్కొంది. కశ్మీర్‌ వివాదంలో భారత్‌ గెలుపును పాక్‌ అంగీకరించాలని శివసేన వ్యాఖ్యానించింది.

ఒక చేత్తో చర్చలంటూ మరో చేత కుట్ర పన్నే పాక్‌ తీరు భారత్‌తో పనిచేయదని తేల్చిచెప్పింది. ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయానికి ముందు భారత్‌ తమను సంప్రదించలేదన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటనను సేన తప్పుపట్టింది. ఇరాక్‌పై దండెత్తే సమయంలో, సద్ధాం హుస్సేన్‌ ఉరితీత సందర్భాల్లో అమెరికా భారత్‌ అభిప్రాయాన్ని కోరిందా అని ప్రశ్నించింది.