ఆస్ట్రేలియా ప్రధానికి చేదు అనుభవం..

కాన్‌బెర్రా : ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌ కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కొందరితో మాట్లాడుతున్న సమయంలో వెనుక వైపు నుంచి ఓ మహిళ గుడ్డుతో దాడి చేశారు. ఈ నెల 18వ తేదీన ఆస్ట్రేలియాలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఆ క్రమంలో కాన్‌బెర్రా సమీపంలోని అల్బురిలో ప్రచారం నిర్వహించడానికి వెళ్లారు మారిసన్. అక్కడ కంట్రీ వుమెన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా ఆయన తలపై గుడ్డు పడింది.

ఆకస్మాత్తుగా వెనుక వైపు నుంచి తలపై గుడ్డు పడటంతో మారిసన్ కంగుతిన్నారు. 25 ఏళ్ల యువతి ఆయనపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ గుడ్డు మాత్రం పగలలేదు. సాక్షాత్తు ప్రధానిపై గుడ్డు అటాక్ జరగడంతో సెక్యూరిటీ సిబ్బంది అలర్టయ్యారు. ఆ సమయంలో అక్కడ ఏదో జరగబోతోందని భావించి అక్కడున్నవారు ఉరుకులు పరుగులు పెట్టారు. దాంతో స్వల్ప తోపులాట జరిగి ఓ వృద్ధురాలు కిందపడిపోతే.. ఆమెకు మారిసన్ చేయి అందించి పైకి లేపారు. ఎగ్ అటాక్ అయిన తర్వాత అదేమీ పట్టించుకోకుండా ఆమెకు సాయం చేయడం విశేషం. చివరకు ప్రధానిపై గుడ్డుతో దాడిచేసిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదలావుంటే మారిసన్ పై జరిగిన గుడ్డు దాడి వీడియో వైరల్ గా మారింది.

ఆస్ట్రేలియాలో ఇలాంటి ఎగ్ అటాక్స్ ఇదివరకు చాలానే జరిగాయి. ఈ ఏడాది మార్చి నెలలో సెనేటర్ ఫ్రేజర్ యానింగ్ మీడియాతో మాట్లాడుతుండగా.. పక్కనే నిలబడ్డ ఓ యువకుడు తన చేతిలోని గుడ్డు తీసి ఆయన తలకేసి కొట్టాడు. ఆ గుడ్డు కాస్తా పగలడంతో ఆయనకు కోపం తెప్పించింది. వెంటనే ఆ యువకుడి వైపు తిరిగి చెంప చెళ్లుమనిపించారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అప్పట్లో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారి 24 గంటల్లోపే దాదాపు 2 మిలియన్ల (20 లక్షలు) మంది వీక్షించారు. న్యూజిలాండ్ మసీదు కాల్పులపై ఫ్రేజర్ యానింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతోనే ఆ దాడి జరిగినట్లు ప్రచారం జరిగింది.