మిషన్ శక్తిపై అమెరికా ఆందోళన

వాషింగ్టన్: మిషన్ శక్తిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఏ – శాట్ ప్రయోగంపై భారత ప్రధాని మోదీ ప్రకటన తమ దృష్టికి వచ్చిందని.. అయితే తమ ఆందోళన అంతా అంతరిక్షంలో పేరుకుపోయే శకలాల గురించేనని ఆ దేశ రక్షణశాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే దీర్ఘకాలిక వ్యూహాత్మక బంధాల్లో భాగంగా అంతరిక్ష, శాస్త్ర సాంకేతికత, ప్రాంతీయ భద్రత, రక్షణ రంగాల్లో భారత్‌తో పరస్పర సహకారం కొనసాగుతుందన్నది. రక్షణశాఖ కార్యదర్శి పాట్రిక్ షానన్ మాట్లాడుతూ.. అంతరిక్షం అనేది అందరూ కలిసి స్వేచ్ఛగా పనిచేసుకునేదని.. అశాంతిని సృష్టించకూడదని వ్యాఖ్యానించారు. భారత్ ప్రయోగంపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. మరోవైపు చైనా కూడా తన స్పందన తెలియజేసింది. అంతరిక్షంలో ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రపంచదేశాలపై ఉందంటూ ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో భారత్ మాత్రమే కాకుండా.. క్షిపణి ద్వారా ఉపగ్రహాలను కూల్చివేయగల సామర్థ్యాన్ని సాధించిన అన్ని దేశాలు కూడా అంతరిక్షంలో శాంతిని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఏ – శాట్‌ను భారత్ విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ క్షిపణి ప్రయోగాన్ని డీఆర్‌డీఓ, ఇస్రో సంయుక్తంగా నిర్వహించాయని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. ఈ సామర్థ్యం కలిగిన ఉన్నదేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. అమెరికా, చైనా, రష్యాలు మాత్రమే ఈ ప్రయోగాలు నిర్వహించాయి.