మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సిందే: అమెరికా

పాక్ లో ఉంటూ అనేక దుస్సాహసాలకు పాల్పడుతున్న జైష్‌ ఎ మహ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సిందేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. లేనిపక్షంలో శాంతి, సుస్థిరతకు భంగం వాటిల్లుతుందని అభిప్రాయపడింది. ఐరాస భద్రతా మండలి కీలక సమావేశం జరిగిన నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది. అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి తగిన ఆధారాలు ఉన్నాయని అమెరికా పేర్కొంది.
ఆ దేశ విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి రాబర్ట్‌ పల్లాడినో ఈ మేరకు వ్యాఖ్యానించారు. జేఈఎమ్‌ అనేక ఉగ్రదాడులకు పాల్పడిందన్నారు. ఉగ్రవాదంపై భారత్‌, అమెరికా కలిసి పోరాడతాయని స్పష్టం చేశారు. ఐరాసలోనూ భారత్‌కు తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ ఇప్పటికే అమెరికా మూడు సార్లు ప్రతిపాదించింది. అయితే చైనా తన వీటో అధికారంతో ప్రతిసారీ అడ్డుతగులుతూ వస్తోంది. దీనిపై స్పందించిన పల్లాడినో.. శాంతి, సుస్థిరతకు చైనా, అమెరికా కలిసే పనిచేస్తున్నాయన్నారు.