ఇండోనేషియాను వణికించిన భూకంపం

భూకంప విలయానికి ఇండోనేషియా వణుకుతోంది. వారం రోజుల వ్యవధిలోనే మరో భూకంపం ఇండోనేషియాను తీవ్రంగా నష్టపరిచింది. లోమ్‌బాక్‌ ద్వీపంలో రిక్టర్‌ స్కేల్‌పై 7గా నమోదైన భూకంపం ధాటికి 82 మంది ప్రాణాలు కోల్పోయారు.ఎన్నో భవనాలు కూలిపోయాయి. భూకంప సమయంలో ప్రజలు భయంతో పరుగులు తీశారు. చాలా సేపు భూమి కంపిస్తూనే ఉంది. ఇండోనేషియా అధికారులు ఈ ఉత్పాతాన్ని తొలుత సునామీ అనుకుని భయపడ్డారు. ఆ స్థాయిలో భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రతకి ఎక్కడో 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాండుంగ్‌ నగరం కూడా కంపించింది. బాలీ ద్వీపంపై కూడా ప్రభావం పడింది. ఇండోనేషియా ప్రభుత్వం రక్షణ చర్యలు కొనసాగిస్తోంది. ఈ మధ్య ఇండోనేషియాలో సంభవించిన భూకంపాల్లో ఇదే తీవ్రమైనది. జూలై 29న కూడా లోమ్‌బాక్‌లో సంభవించించిన భూకంపానికి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ మీద ఉండే ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. సునామీల ప్రభావం అధికమే. 2004 లక్షల మంది ప్రాణాలు హరించిన రాకాసి సునామీ ఇండోనేషియా సమత్రా దీవుల్లో సంభవించిన విషయం తెలిసిందే.