ఇద్దరు ముద్దుగుమ్మలతో చిరు చిందులు..!

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు టాలీవుడ్‌ హిస్టరీలో ప్రత్యేక పేజీ ఉంటుంది. ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి టాప్ హీరోగా ఎదిగిన చిరు.. ఇప్పటికీ నంబర్ 1 హీరోగానే కొనసాగుతున్నారు. మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. ఆయన స్థానాన్ని మాత్రం ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు. అంతేకాదు భవిష్యత్‌లోనూ చిరు స్థానాన్ని భర్తీ చేసే హీరో రావడం కష్టమన్నది సినీ విశ్లేషకులు అభిప్రాయం. అయితే ఆయన పేరు వింటే ఎన్నో అవార్డులు, రివార్డుల పాటు డ్యాన్స్ కూడా వినిపిస్తుంది. టాలీవుడ్‌లో డ్యాన్స్‌కు క్రేజ్ తీసుకొచ్చిన హీరోల్లో ఆయన పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆయన డ్యాన్స్‌లో ఓ స్టైల్, ఓ గ్రేస్ ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో చాలామంది హీరోలు డ్యాన్స్‌లతో అదరగొడుతున్నా.. చిరు గ్రేస్‌ను మాత్రం వారెవరు మ్యాచ్ చేయలేరన్నది సినీ పరిశ్రమ ఎరిగిన సత్యం. ఇప్పుడు ఈ విషయం మరోసారి రుజువైంది.

‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ పేరుతో ఎనభైల నాటి తారలంతా ప్రతి సంవత్సరం జరుపుకునే వేడుకలు ఈ సారి మెగాస్టార్ చిరంజీవి కొత్త ఇంట్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇందులో టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్, మాలీవుడ్‌కు చెందిన 40మంది అప్పటి టాప్ హీరోహీరోయిన్లు పాల్గొని సందడి చేశారు. ఇక ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలన్నీ ఆ మధ్యనే విడుదల కాగా.. తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో చిరంజీవి ‘బంగారు కోడిపెట్ట’ పాటకు డ్యాన్స్ వేశారు. ఆయనతో పాటు ఖుష్బూ, జయప్రదలు కూడా తమ కాలును కదిపారు. 64ఏళ్ల వయస్సులో ఆయన చేసిన ఈ డ్యాన్స్ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఆ వీడియోలో చిరు డ్యాన్స్‌ను చూసిన అభిమానులు ”బాసూ.. నువ్వు సూపర్”.. ”డ్యాన్స్‌లో నీ గ్రేస్‌ను అందుకునే హీరో ఇంకా పుట్టలేదు మామ”.. ”వయసు అన్నది ఆయనకు మాత్రమే.. ఆయన డ్యాన్స్‌, గ్రేస్‌కు కాదు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇటీవల చిరంజీవి సైరాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఆయన అభిమానులు తెగ ఆకట్టుకుంది. ఇక త్వరలో కొరటాల దర్శకత్వంలో నటించబోతున్నారు చిరంజీవి. రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.