ఆగని సైరా కలెక్షన్ల సునామీ..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి రిలీజ్‌ అయి పది రోజులవుతున్న కలెక్షన్ల హవా కొనసాగుతోంది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తోంది. మెగా ఇమేజ్‌ను అడ్డుకునే స్థాయి సినిమాలేవి విడుదల కాకపోవటం, సైరా తరువాత రిలీజ్‌ అయిన ఏ సినిమాకూ పాజిటివ్‌ టాక్‌ రాకపోవటం కూడా మెగా మూవీకి కలిసొచ్చింది.

ఈ శుక్రవారం కూడా చెప్పుకోదగ్గ సినిమా ఏదీ థియేటర్లలోకి రాకపోవటంతో ఈ వారం కూడా సైరానే టాప్‌లో నిలుస్తోంది. పదో రోజు కూడా సైరా కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. శుక్రవారం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్లకు పైగా షేర్ సాధించటం విశేషం. వరల్డ్ వైడ్‌ షేర్‌ చూసుకుంటే 3 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంటుందంటున్నారు విశ్లేషకులు.

ఇదే ఊపు కొనసాగితే ఆదివారం కల్లా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల షేర్‌ మార్క్‌ను అందుకుంటుందంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక గ్రాస్ విషయానికి వస్తే ఇప్పటికే 200 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించినట్టుగా ట్రేడ్‌ ఎనలిస్ట్‌లు లెక్కలు తేల్చారు. మెగా స్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి కలెక్షన్ల విషయంలోనూ అదే జోరు చూపిస్తోంది. మెగాస్టార్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా, బిగ్గెస్ట్ గ్రాసర్‌గా చరిత్ర సృష్టించింది.

రంగస్థలం సమయంలోనే తన సినిమాలకు సంబంధించిన కలెక్షన్ల లెక్కలు ప్రమోషన్‌ కోసం వాడనని చెప్పిన రామ్‌ చరణ్‌, సైరా విషయంలోనూ అదే మాట మీద నిలబడ్డాడు. ఇప్పటి వరకు సినిమా కలెక్షన్లకు సంబంధించి ఒక్క అధికారిక పోస్టర్‌ను కూడా చిత్రయూనిట్‌ రిలీజ్‌ చేయలేదు. అయితే ట్రేడ్‌ ఎనలిస్ట్‌లు మాత్రం ఎప్పటికప్పుడు సినిమా వసూళ్లపై క్లారిటీ ఇస్తూ వస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. తండ్రి కలను నిజం చేసేందుకు మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండ్‌ అమితాబ్ బచ్చన్ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో నటించారు.

కన్నడ నటుడు సుదీప్‌, తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో నయనతార, తమన్నాలు హీరోయిన్లుగా నటించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌తో ఈ సినిమాను రూపొందించారు. దాదాపు 270 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించారు. అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బ్రేక్‌ ఈవెన్‌కు చేరువైన సైరా నరిసింహారెడ్డి, ఈ వారాంతానికి దాదాపు అన్ని చోట్లా సేఫ్ జోన్‌లోకి వస్తుందంటున్నారు విశ్లేషకులు.