మెగాస్టార్ మూవీలో రంగమ్మత్త..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సైరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో, అలానే మెగా ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలున్నాయి. ఇకపోతే సైరా చేస్తూ ఉండగానే, మెగాస్టార్ తాను చేయబోయే తదుపరి సినిమాను లైన్లో పెట్టబోతున్నట్లు సమాచారం.

శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ రెండు విభిన్న పాత్రల్లో నటించబోతున్నారని, అలానే ఒక ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత ఈ సినిమాని నిర్మించబోతున్నారని సమాచారం.ఇప్పటికే ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపికను ప్రారంభించారట కొరటాల. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో యాంకర్ మరియు నటి అనసూయ భరద్వాజ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వస్తోంది.

నిజానికి చిరు తనయుడు రామ్ చరణ్ హీరోగా గత ఏడాది వచ్చిన రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్రతో మంచి పేరు సంపాదించిన అనసూయ, ఈ సినిమాలోని పాత్రతో కూడా మరింత పేరు సంపాదిస్తుందని అంటున్నారు. ఇక ఆ పాత్రకు అనసూయ అయితేనే కరెక్ట్ గా సరిపోతుందని భావించి చిత్ర యూనిట్ ఆమెను ఎంపిక చేసిందట. ఇక దర్శకుడు కొరటాల కూడా నేడో, లేక రేపో ఆమెకు సినిమా కథ మరియు ఆమె పాత్ర గురించి చెప్పడం జరుగుతుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం అటు సినీ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజం ఎంతవరకు నిజం ఉందొ తెలియాలంటే ఆ చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే…!!