‘మహర్షి’ మూవీ రివ్యూ

నటీనటులు : మహేష్ బాబు, పూజ హెగ్డే, అల్లరి నరేష్, ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్, జగపతిబాబు 
డైరెక్షన్ : వంశీ పైడిపల్లి 
మ్యూజిక్ : దేవిశ్రీ ప్రసాద్ 
నిర్మాతలు : దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్లో 25వ సినిమాగా.. ఈ ఏడాది సమ్మర్ సీజన్లో భారీ ప్రాజెక్టుగా తెరకెక్కింది ‘మహర్షి’. ఘన చరిత్ర కలిగిన ముగ్గురు నిర్మాతలు కలిసి తీసిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య థియేటర్లకొచ్చింది. మహేష్ కెరీర్ లో నిలబడిపోయే సినిమాగా విపరీతంగా ప్రచారం పొందిన ‘మహర్షి’ ఫీడ్ బ్యాక్ ఎలా వుంది..? మహేష్ అభిమానులకు ఈ మండువేసవిలో గ్రాండ్ రిలీఫ్ దొరికినట్లేనా?

మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి.. చిన్నప్పటి నుంచి అప్పులతోనే నెట్టుకొచ్చిన అమ్మానాన్నల (ప్రకాష్ రాజ్-జయసుధ) మధ్య పెరిగిన ఆవేశపరుడు, ఆలోచనపరుడు రిషి (మహేష్ బాబు) లైఫ్ జర్నీ పేరే ‘మహర్షి’. పది వేల రూపాయలు కూడా దొరకని కుటుంబంలో ఉంటూ.. ఆర్ధిక కష్టాల్ని దగ్గరగా చూసిన రిషి.. డబ్బుతో ముడిపడ్డ ప్రపంచాన్ని గెలవాలన్నంత కసిని పెంచుకుంటాడు. ‘ఓడిపోతూ కూడా నవ్వుతూ బతకడం నా వల్ల కాదు..’ అంటూ సీరియస్‌గా టార్గెట్ ఫిక్స్ చేసుకుని.. చివరకు గెలుస్తాడు. తాను ఆశించిన విజయాన్ని సాధిస్తాడు. కానీ.. ఆ విజయం అసలైన విజయం కాదని తెలుసుకుని.. మళ్ళీ వెనక్కొచ్చి సిసలైన మరో విజయాన్ని వెతుక్కుని దాన్ని కూడా సాధిస్తాడు. ఈ జర్నీలో పూజ (పూజ హెగ్డే), రవి (అల్లరి నరేష్) అతడికి తోడుగా వుంటారు. కానీ.. రెండు రకాల విజయాల్ని సాధించడంలో అతడు ఎదుర్కొన్న అవాంతరాలు, ఆటుపోట్లు ఏమిటన్నదే ‘మహర్షి’ ప్రయాణం.

స్క్రీన్ ప్లే :

ఫస్టాఫ్ మొత్తం రిషి ‘దూకుడు’ స్వభావంతోనే సాగుతుంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా నడిచే ఈ మొదటి జర్నీలో అతడి మెదడు మాత్రమే అతడి వెంట నడుస్తుంది. మనసుకు చోటుండదు. వైజాగ్‌లో ఇంజనీరింగ్ స్టూడెంట్‌గా మొదలయ్యే రిషి సక్సెస్ జర్నీ.. న్యూయార్క్‌లో ఆరిజిన్ అనే మల్టి నేషనల్ కంపెనీకి సీఈఓగా సెటిలయ్యేదాకా నాన్‌స్టాప్‌గా నడుస్తుంది. ఈ క్రమంలో సహజంగా కలిగే అడ్డంకుల్ని, విధిపూర్వకంగా జరిగే అవాంతరాల్ని దాటుకుంటూ గుడ్డిగా ముందుకెళ్తాడు. సెకండాఫ్‌లో మాత్రం.. ‘రిషి’ మనిషవుతాడు. తన విజయం వెనుక తనకు తెలీకుండానే జరిగిన కొన్ని బరువైన త్యాగాలున్నాయన్న విషయాన్ని తెలుసుకుని.. చలించిపోతాడు. గెలవడం అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదన్న వాస్తవాన్ని గ్రహించి.. మళ్ళీ ‘డౌన్ టు ఎర్త్’ అంటూ ఇండియాకొచ్చేస్తాడు. ఈసారి మెదడుతో మాత్రమే కాకుండా మనసుకు నచ్చే విధంగా నడుచుకుని.. చివరకు అసలైన విజయాన్ని సాధిస్తాడు.

ప్లస్ & మైనస్ :

గంటన్నరలో ముగించగలిగిన కంటెంట్‌ని మూడు గంటల పాటు సాగదీసినా.. ఇదేమంత గొప్ప ల్యాగ్ కాదనిపించేలా స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్. రిషి జర్నీలో లవ్, హ్యూమన్ రిలేషన్స్, సెంటిమెంట్ లాంటివన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోతాయి. హీరో ఎమోషనల్ టార్గెట్‌ని బిగుతుగా బిల్డప్ చేయడానికి మిగతా విషయాల్ని ఉద్దేశపూర్వకంగానే చిన్నవి చేసి చూపించి తెలివి ప్రదర్శించాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. యుక్తవయసుకొచ్చిన కొడుకు, మధ్య వయసు దాటిన తండ్రికి మధ్య వుండే థాట్ గ్యాప్‌ని యాజిటీజ్ ప్రెజెంట్ చేసి.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సినిమాలో కలుపుకోగలిగాడు. రిషి జర్నీ అనీవెన్‌గా అనిపిస్తూ ప్రేక్షకుడిలో అసహనం కలిగినప్పుడల్లా.. కథనంలో ఒక అనూహ్యమైన మలుపునిస్తుండడం డైరెక్టర్ పాటించిన మరొక బ్యాలెన్సింగ్ యాక్ట్.

‘ఏదైనా ఫ్యాక్టరీ కట్టడం కోసం ఖాళీ అవుతున్న ఒక చిన్న పల్లెటూరు.. ఈ కుట్ర వెనుక కొన్ని బడాసైజు కార్పొరేట్ శక్తులు ..’! హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం కోసం ఈ మధ్యకాలంలో తరచూ వాడే కాన్సెప్ట్. ‘మహర్షి’లో కోసం కూడా వంశీ పైడిపల్లి ఈ లైన్‌నే ఎంచుకున్నాడు. కానీ.. వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను డిటైల్డ్‌గా చెప్పే ప్రయత్నం చేస్తూ.. అర్బన్ సొసైటీని కూడా కదిలించే ప్రయత్నం చేశారాయన. “తినేవాళ్లు పెరిగిపోతున్నారు, పండించేవాళ్ళు తగ్గిపోతున్నారు.. అందుకే కల్తీ పెరిగిపోయి మన పిల్లలకు మనమే విషం తినిపిస్తున్నాం” అంటూ వ్యవసాయం గురించి చెప్పిన బరువైన మాటలు ప్రేక్షకులనే కాదు.. సినిమాలో క్యారెక్టర్లను కూడా కదిలించినట్లు చూపెట్టాడు దర్శకుడు. సెకండాఫ్‌లో పట్టు తప్పినట్లనిపించి.. కథనం పడుతూ లేస్తూ ముందుకెళ్తున్నప్పడు.. దర్శకుడు ఇంటిలిజెంట్‌గా వ్యవహరించాడు. అల్లరి నరేష్‌ని కాపాడే క్రమంలో మహేష్ చేసిన ఫైట్ సీక్వెన్స్, వీకెండ్ ఫార్మింగ్ అనే సరికొత్త సోషల్ మూమెంట్.. లాంటి ఎపిసోడ్స్ సినిమాని పైకి లేపాయి.

పెర్ఫామెన్స్ :

కాలేజ్ క్యాంపస్‌లో ‘కాఫీకి కలుద్దామా’ అనే ఎపిసోడ్ ఒక ఆటవిడుపు. హీరోలోని ఇంటర్నల్ ఎమోషన్స్‌ని కాస్త లూజ్ చేస్తూ.. అతడి జోవియల్ నేచర్ ఎక్స్‌పోజ్ చేయడం కోసం పనికొచ్చింది. హీరోకి లవ్ ప్రపోజ్ చెయ్యకముందే హీరోయిన్ పేరెంట్స్‌తో కలిసి పెళ్లిచూపులు ప్లాన్ చేసిన వైనం ఒక వెరైటీ కాన్సెప్ట్. ప్రేక్షకుడికి కాసేపు కామెడీ డిష్ దొరికినట్లయింది. పెళ్లిచూపులు సీన్లో కనిపించిన కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ లాంటి డజను మంది సీనియర్ ఆర్టిస్టులు సినిమాలో అంతకుముందు కానీ, తర్వాత కానీ ఎక్కడా కనిపించరు. విలన్‌గా జగపతిబాబు గెటప్, మేనరిజం గతంలో చాలాసార్లు చూసిన భావన కలుగుతుంది. పోసాని కృష్ణమురళి పొలిటీషియన్ పాత్ర మొనాటనీగా అనిపించినా.. పెర్ఫామెన్స్ పరంగా తేడా చూపించారు. వెన్నెల కిషోర్ అక్కడక్కడా కొన్ని హాస్య గుళికలు రాల్చివెళ్లడం హాయిగా అనిపించింది.

‘మనం పట్టుకున్న కొద్దీ దూరంగా పారిపోయేది.. మనం తృణప్రాయంగా వదిలేసినకొద్దీ మన వెంట పడేది..’ అంటూ డబ్బుకు ఇచ్చిన కొన్ని డెఫినిషన్స్ టచ్చింగ్‌గా అనిపిస్తాయి. వేగంగా పరుగెత్తే వాడినే ప్రపంచం గుర్తిస్తుంది అంటూ హీరో తన దూకుడు స్వభావాన్ని జస్టిఫై చేసుకునే విధానం బాగుంది. ప్రపంచం దృష్టిలో గెలవడం.. మనసుకు నచ్చేలా గెలవడం అంటూ విజయంలోని రెండు పార్శ్వాల్ని ఎస్టాబ్లిష్ చేయడంలో వంశీ పైడిపల్లి రైటర్స్ టీమ్ బాగా కష్టపడింది. పాటలు పానకంలో పుడకల్లా వచ్చివెళ్లినా.. వాటికి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీట్స్ ఆడియెన్స్‌లో రిథమ్‌ని పుట్టించేశాయి.