`జెర్సీ` చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపిన స్టైలిష్ స్టార్ !

నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం `జెర్సీ`. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సామన్యులతోపాటు సినీ ప్రముఖులను సైతం ఆకట్టుకుంది. ఇప్పటికే ఎన్టీయార్‌, మంచు మనోజ్ వంటి హీరోలు `జెర్సీ` సినిమాను ప్రశంసించిన సంగతి తెలిసిందే.

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా `జెర్సీ`పై ట్విటర్ ద్వారా ప్రశంసలు కురిపించాడు. అందరూ కచ్చితంగా చూడాల్సిన చిత్రమని అభిప్రాయపడ్డాడు. `ఇప్పుడే `జెర్సీ` చూశాను. హృదయాన్ని హత్తుకునే అద్భుతమైన సినిమా. సినిమాలో ప్రతీ సీన్‌ను ఆస్వాదించాను. చిత్రయూనిట్‌కు అభినందనలు. నాని.. నువ్వు అద్భుతంగా నటించావు. ఇప్పటివరకు నువ్వు చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్‌. అలాగే ఇదే ఇప్పటివరకు నీ ఉత్తమ ప్రదర్శన. ఇక, ముఖ్యంగా డైరెక్టర్ గౌతమ్ గురించి చెప్పుకోవాలి. చాలా గొప్పగా సినిమా తీశాడు.

స్టడీ అండ్ బోల్డ్. సినిమా ప్రేమికులందరూ ఈ సినిమాను కచ్చితంగా చూడాల`ని బన్నీ ట్వీట్ చేశాడు. బన్నీతోపాటు అల్లరి నరేష్‌, మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, సుధీర్‌బాబు, సుధీర్ వర్మ, డైరెక్టర్ మారుతి తదితర సినీ ప్రముఖులు ట్విటర్ ద్వారా `జెర్సీ`ని ప్రశంసించారు.