చరణ్ ఆస్తి విలువ అన్ని కోట్లా..?

మెగాస్టార్ వారసుడు .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్తుల విలువ ఎంత? గత కొంతకాలంగా సాగుతున్న ఆసక్తికర చర్చ ఇది. ఇప్పటికే 100కోట్ల షేర్ క్లబ్ హీరోగా సత్తా చాటారు. రంగస్థలం చిత్రంతో నాన్ బాహుబలి రికార్డుని తిరగరాసిన హీరోగా చరణ్ కి పేరుంది. నటించిన రెండో సినిమా మగధీరతోనే 80కోట్ల వసూళ్లు సాధించిన యంగ్ హీరోగా చరణ్ పేరు రికార్డులకెక్కింది. నటించింది కేవలం 12 సినిమాలు మాత్రమే. ఇతర హీరోలతో పోలిస్తే చాలా నెమ్మదిగా కెరీర్ ని సాగిస్తున్నాడు. అయినా అతడి ముఖ విలువ బిజినెస్ వ్యాపకాలు ఆశ్చర్యం కలిగించే రిజల్ట్ ని అందిస్తున్నాయి. ఓవైపు విమాన యాన రంగంలో ట్రూజెట్ యజమానిగా చరణ్ పేరు వినిపిస్తోంది.


మరోవైపు కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ అధినేతగా వరుసగా భారీ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. ఖైదీనంబర్ 150 చిత్రంతో 150 కోట్ల వసూళ్లు అందుకుని ఇప్పుడు ఏకంగా అంతకుమించిన బడ్జెట్ తో సైరా చిత్రాన్ని నిర్మిస్తున్నారు చరణ్. మెగా వారసుడిగా ఆస్తిమంతుడు.. స్థితిమంతుడు.. బ్రాండ్ వ్యాల్యూ ఉన్న మగధీరుడు కావడంతో అతడి ఆస్తుల విలువ దాదాపు 1300 కోట్లకు చేరిందని ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా ప్రకటించడం అభిమానుల్లో చర్చకు తావిచ్చింది.