టీడీపీకి బొత్స కౌంటర్..!

11

ఏపీ అసెంబ్లీ ఆరవ రోజు కూడా వాడీవేడిగా మొదలైంది. ఇళ్ల నిర్మాణ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మళ్ళీ తారాస్థాయికి చేరుకుంది. రివర్స్ టెండరింగ్‌ వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతోందని టీడీపీ ఆరోపించారు. ఇళ్ల నిర్మాణంపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… టీడీపీ హయాంలో దోపిడీ, అవినీతి జరగడం వల్లే.. రివర్స్ టెండరింగ్‌కు వెళ్ళామని స్పష్టం చేశారు.

ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్‌తో సుమారు రూ.106 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందన్నారు. మరోవైపు టీడీపీ 3 లక్షల ఇళ్లకు సుమారు రూ.2 వేల 626 కోట్ల దోపిడీని చేసిందని.. అది తప్పకుండా బయటపెట్టి తీరుతామని స్పష్టం చేశారు. లబ్దిదారుడి దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా ఇళ్లను ఇవ్వాలని సీఎం జగన్ సూచించినట్లు మంత్రి వివరించారు. ఇళ్ల నిర్మాణం విషయంలో రెండు టెండర్లలో రివర్స్ టెండరింగ్‌కి వెళ్తే.. దాదాపు 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందన్నారు.

గత ప్రభుత్వం హడావుడిగా ఇళ్లు నిర్మించిందని.. ఐదు లక్షల ఇళ్లకు అనుమతులు ఇస్తే.. 3 లక్షల ఇళ్లు మాత్రమే మొదలుపెట్టారని.. ఇక అందులో కూడా 70 వేల ఇళ్లు మాత్రమే 90 శాతం పూర్తయ్యాయని మంత్రి చెప్పుకొచ్చారు. కేంద్రం, రాష్ట్రం చెరో లక్షన్నర సబ్సిడీ కింద ఇస్తాయన్నారు. మౌలిక సదుపాయాల కోసం రాష్ట్రము మరో రూ. 90 వేలు ఇస్తున్నదన్నారు. షీర్‌వాల్ టెక్నాలజీని తీసుకొచ్చినా.. ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయలేకపోయారని బొత్స విమర్శించారు.