వైసీపీఎంపీ మాధవి ప్రీ వెడ్డింగ్ షూట్..!

అరకు ఎంపీ గొడ్డేటి మాధవి త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుంది. తన చిన్ననాటి స్నేహితుడు శివప్రసాద్‌ను ఆమె వివాహమాడనున్నారు. ఈ నెల 17 వీరి వివాహం జరగనుంది. మాధవి సొంత గ్రామం శరభన్నపాలెంలో ఈ గ్రాండ్ మ్యారేజ్ జరగనుంది. ఇక రిసెప్షన్ రుషికొండలోని సాయిప్రియ బీచ్ రిసార్ట్స్‌లో ఈనెల 22న జరగనుంది. ఎంపీ మాధవి అతి చిన్న వయస్సులోనే పార్లమెంటులో అడుగుపెట్టారు. అరకు నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు.1
వరుడు ఎవరంటే

వరుడు శివప్రసాద్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంబీఏ చేశారు. ఓ కాలేజ్‌ను ఆయన నడుపుతున్నారు. మాధవి, శివప్రసాద్‌లు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వారి స్నేహం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఒక్కటి కానున్నారు. ఇక పెళ్లికి ముందు వీరిద్దరూ ఓ ప్రీ వెడ్డింగ్ షూట్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఓ మంచి బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‌తో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. ఎంపీ గొడ్డేటి మాధవి, వరుడు శివప్రసాద్‌లు ఈ వీడియోలో ఎంతో చక్కగా కనిపించారు. లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. జలపాతాల మధ్య ఈ వీడియోను షూట్ చేసినట్లుగా ఉంది. ఈ వీడియోలో జంట ఎంతో చూడముచ్చటగా ఉంది. ఒకరి కోసమే ఒకరు, మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఈ కపుల్ ఉంది. మొత్తం ఒక నిమిషం 28 సెకన్ల పాటు ఈ వీడియో ఉంది. వీడియో చివరిలో ఈ జంట వివాహ తేదీ, రిసెప్షన్ తేదీ వస్తుంది.

ఇక రాజకీయంగా చూస్తే అతి చిన్న వయస్సులోనే గొడ్డేటి మాధవి పార్లమెంటులో అడుగుపెట్టారు. లోక్‌సభలో అడుగుపెట్టే సరికి ఆమె వయస్సు 25 ఏళ్లు మాత్రమే. అరకు లోక్‌సభ నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన గొడ్డేటి మాధవి, మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్‌పై రికార్డు స్థాయిలో విజయం సాధించారు.

అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో కిషోర్ చంద్రదేవ్ 30 ఏళ్ల రాజకీయచరిత్రను మాధవి మట్టికరిపించారు. గొడ్డేటి మాధవికి 5,62,190 ఓట్లు పోల్ అవగా తెలుగుదేశం నుంచి పోటీచేసిన కిషోర్ చంద్రదేవ్‌కు 3,38,101 ఓట్లు వచ్చాయి. మొత్తానికి గొడ్డేటి మాధవి 2,24,089 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టారు. ఈమె మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తె.