లోకేష్ కామెంట్స్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్.. !

334

తెలుగుదేశం భావి వారసుడు లోకేష్ మాటలు, చేతలు కూడా ఎపుడూ చిక్కుల్లో పడేసేవే. ఓ వ్యూహం ప్రకారం ఏ మాటనైనా వాడే చంద్రబాబు ఓ వైపు ఉంటే ఆయన రాజకీయ వారసుడు మాత్రం ఎందుకో ప్రతీసారీ సూపులోనే పడుతూంటారు. ఆయన అతి ఉత్సాహమే ఇలా కొంప ముంచుతోందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలో ఓ పెద్ద పార్టీకి బాధ్యునిగా ఉన్నానన్న స్ప్రుహ లోకేష్ లో ఎక్కడా కనిపించకపోవడమే ఇపుడు ఇబ్బందిగా ఉందంటున్నారు.

ఈ ట్విట్టర్ పిట్టగాలోకేష్ ట్వీట్లకు బాగా అలవాటు పడ్డారు కానీ వాటి ఫలితాల గురించి ఎక్కడా ఆలోచించడంలేదంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ తీసుకుంటే పైకి కనిపించని ఎన్నో వర్గాలు ఉన్నాయి. పైగా సినిమా నటులు సైతం రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. దాంతో అక్కడ కూడా పార్టీలూ పేచీలు బోలేడు ఉన్నాయి. ఈ సమయంలో సరైన అంచనాలు వేసుకుని ఒక మాట మాట్లాడాలంటారు. మరి లోకేష్ మాత్రం ఇలా సైరా రిలీజ్ అయినో లేదో అలా చిరంజీవిని, మూవీ ని తెగపొగిడారు. శిఖరాయమానమైన నటనను చిరంజీవి కనబరచారని కీర్తించారు. ఇక్కడ చిరుకు బాగానే భజన చేసి రాజకీయంగా కరెక్ట్ వ్యూహానికి తెర తీశానని లోకేష్ అనుకున్నాడు కానీ అక్కడే ఆయన పప్పులో కాలు వేశారని అంటున్నారు.

తన సొంత బావమరిది జూనియర్ ఎన్టీయార్ ఫ్యాన్స్ నుంచి ఇపుడు లోకేష్ ఒక్కటే ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారట. అయిదేళ్ల కాలంలో జూనియర్ ఎన్టీయార్ ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ చేసినా ఒక్క దానికి కూడా ట్వీటావా లోకేషా అంటూ ఫ్యాన్స్ తగులుకుంటూంటే అడ్డంగా దొరికేయడం లోకేష్ వంతు అవుతోందిట. జూనియర్ నటనను కూడా ఇలాగే మెచ్చుకుంటే ఇపుడు చిరు విషయంలో లోకేష్ కామెంట్స్ తాము సీరియస్ గా తీసుకునే వాళ్ళం కాదని అంటూ ఫ్యాన్స్ ఒక్కటే ట్రోల్ చేస్తున్నారుట.

మరో వైపు లోకేష్ ఇంట్లో మామ బాలయ్య ఉన్నారు. ఆయన ఇప్పటివరకూ సైరా మూవీ విషయంలో ఒక్క కామెంట్ పెట్టలేదు. మరి ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా క్యాంప్ తోనే పోటీ అనుకుంటారు. మామ మనోభావాలను కూడా తెలుసుకోకుండా చిరంజీవిని ఆకాశానికి ఎత్తేయడం, ఆయన నటనలో శిఖర సమానుడు అంటూ లోకేష్ కీర్తించడం ఇంట్లో కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతోందేమోనని అంటున్నారు. మొత్తానికి మెగా ఫ్యామిలీని మచ్చిక చేసుకుందేందుకు లోకేష్ చేస్తున్న ట్వీట్లు నందమూరి హీరోలకు గుస్సా తెప్పిస్తున్నాయని అంటున్నారు.