జగన్ వద్దకు నెల్లూరు పంచాయతీ ..!

71

సీఎం జగన్‌ వద్దకు నెల్లూరు పంచాయితీ చేరింది. బుధవారం సాయంత్రం క్యాంప్‌ ఆఫీసులో నెల్లూరు నేతలతో సీఎం భేటీ కానున్నారు. నెల్లూరు జిల్లా నేతల మధ్య విభేదాలు, ఆధిపత్య పోరుపై జగన్ సీరియస్ అయ్యారు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో నేతల మధ్య సమన్వయ లోపంపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి గోవర్దన్‌రెడ్డి తీరుపై జగన్‌ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.

జగన్ వద్దకు నెల్లూరు పంచాయతీ | Nellore YSRCP Leaders To Meet CM YS Jagan Today | Prime9 News

నెల్లూరు జిల్లాలో శ్రీధర్‌రెడ్డి, కాకాణి మధ్య విభేదాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీధర్‌రెడ్డి, సర్వేపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాకాని మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి తన ఇంటిపై దాడిచేశారని, దౌర్జన్యం చేశారని వెంకటాచలం ఎంపీడీవో సరళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సరళ ఫిర్యాదుతో శ్రీధర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలపై ఐపీసీ సెక్షన్లు 290, 427, 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తాను ఎంపీడీవో ఇంటికి వెళ్లలేదని కోటంరెడ్డి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. చాలాకాలంగా వీరి మధ్య విభేదాలు రాజుకుంటున్నాయి.

జిల్లా అధ్యక్ష పదవి కావాలని చాలాకాలంగా శ్రీధర్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధ్యక్ష పదవి విషయంలో ఎంపీ మేకపాటి రాజగోపాల్‌రెడ్డి సహా ఇతర నాయకులు కాకానికి మద్దతుగా నిలిచారు. రెండు పర్యాయాలుగా గోవర్దన్‌రెడ్డి జిల్లా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో క్రమ శిక్షణాపరంగా కాకాని కనుసన్నల్లో నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇందుకు విరుద్ధంగా జిల్లా నేతలు వ్యవహరిస్తున్నారు. ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మంత్రి అనిల్ ఎవరికి వారు తమ స్వంత కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేతలంతా వారి కార్యాలయాల నుంచే రాజకీయ, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే జిల్లా కార్యాలయానికి రాకుండా స్వంత కార్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జిల్లాలో చర్చకు దారి తీస్తోంది. మంత్రి అనిల్, కోటంరెడ్డి ఒక వర్గం, మిగిలిన నేతలు మరో వర్గంగా చీలిపోయారు. జిల్లాలో నేతల మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై ఆసక్తి నెలకొంది.