హుజూర్‌నగర్లో బాలయ్య ప్రచారం…!

88

తెలంగాణలోని హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో సినీ హీరో, ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారానికి దిగుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి అక్కడ చావా కిరణ్మయి అభ్యర్థినిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెకు మద్దతుగా ప్రచారం చేసేందుకు స్థానిక నేతలతో పాటు తెలంగాణ టిడిపి నేతల ఒత్తిడితో చంద్రబాబు బాలయ్యను ప్రచారానికి దింపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఇక్కడ పోటీ చేస్తున్న పార్టీలో టీఆర్ఎస్ కు ఇప్పటికే సిపిఐ, వైసీపీ మద్దతు ప్రకటించాయి. బిజెపి టీడీపీలకు ఎవరి మద్దతు లభించలేదు. సిపిఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీకి కోదండరాం సపోర్ట్ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు కోసం కాంగ్రెస్ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఇంకా ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. బాలయ్య ప్రచారంలోకి వస్తున్నట్టు వార్తలు రావడంతో తెలంగాణ టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది.

వచ్చేవారంలో బాలయ్య మూడు నాలుగు రోజుల పాటు ఉ హుజూర్ నగర్ లో ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే హుజూర్నగర్ లో టిడిపి సత్తా ఏంటో చూపించాలని స్థానిక నేతలు ఎంత కసితో ఉన్నా ఇప్పటికైతే టిడిపి అక్కడ నామమాత్రపు ప్రభావం కూడా చూపించడం లేదు. గత డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బాలయ్య తెలంగాణలో టిడిపి అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు.

ఆ ఎన్నికల్లో బాలయ్య ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ టిడిపి చిత్తు చిత్తుగా ఓడిపోయింది. పైగా బాలయ్య ప్రసంగాల్లో తప్పులు దొర్లడంతో ఆయన నవ్వులపాలు కావడంతో పాటు టిడిపి పరువు పోయింది. బాలయ్యను కేవలం ఒక సినిమా హీరోగా మాత్రమే చూస్తున్నారు తప్ప ఆయన వల్ల రాజకీయంగా టిడిపికి ఎలాంటి ప్రయోజనం లేదు అన్నది ఇప్పటికే చాలాసార్లు స్పష్టంగా తేలిపోయింది. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలే అంతంత మాత్రంగా ఉన్న హుజూర్‌నగర్ లో బాలయ్య వచ్చినా చేసేది ఉండదని తెలంగాణ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక బాలయ్య ప్రచారానికి వస్తున్నాడంటేనే ఆ పార్టీ శ్రేణులే భయపడిపోతున్నాయి. ప్రచారంలో సైతం బాలయ్య ఇష్టం వచ్చినట్టుగా పార్టీ కార్యకర్తలపైనే చేయి చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు హుజూర్‌నగర్లో అయినా బాలయ్య స్థిరత్వంతో ఉండి ప్రచారం చేస్తారా ? లేదా ? మళ్లీ ఎవరిని అయినా వాయించేస్తారా ? అన్నది చూడాలి.