రేవంత్ ​రెడ్డికి జనసేనాని ఫోన్!

కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం ఉదయం 10 గంటలకు దస్పల్లా హోటల్‌లో నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశంలోపాల్గొనాలని ఆహ్వానించారు. పవన్‌ ఆహ్వానానికి రేవంత్‌ అంగీకరించారు. వీహెచ్‌ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. తెలంగాణలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ నేతలు, మేధావులు ఆందోళన వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వీహెచ్‌ పవన్‌ను కలిసిన సంగతి తెలిసిందే.

నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పోరాటానికి సిద్ధమైంది. పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు (వీహెచ్) నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. యురేనియం తవ్వకాల అంశంపై వీహెచ్ సోమవారం జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరగా.. పవన్ సానుకూలంగా స్పందించారు.

యురేనియం తవ్వకాలతో క్యాన్సర్‌, మూత్రపిండ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కృష్ణా జలాలు కలుషితమవుతాయని.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్‌ స్వరం వినిపించగా.. నటుడు విజయ్ దేవరకొండ కూడా స్వరం కలిపారు. తాజాగా సినీ నటి సమంత నల్లమల యురేనియం తవ్వకాలపై స్పందించారు. నల్లమల అడవులను యురేనియం బారి నుంచి కాపాడాలని ఛేంజ్.ఆర్గ్‌లో మొదలైన ఆన్‌లైన్ పిటిషన్‌ను సమంత షేర్ చేశారు. ఈ పిటీషన్‌పై సంతకం చేశాను. మరి మీరు? అని ఆమె ట్వీట్ చేశారు.