టీడీపీ నేతలు దద్దమ్మల్లా తయారయ్యారు:మేరుగ నాగార్జున

వచ్చే నెల 23తో ఏపీకి చంద్రబాబు పీడ విరగడ కాబోతోందని వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించే నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలన అనంతరం చాలా జిల్లాల్లో కనీసం తాగునీటి వసతి కూడా లేదని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడారు.

ప్రజల బాధలు, ఇబ్బందులు కనిపించని చవట, దద్దమ్మల్లా టీడీపీ నేతలు తయారు అయ్యారని ఆక్షేపించారు. అందుకే ఏపీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకుడి అవసరం వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఏపీ అంతటా జగన్ రావాలని కోరుకుంటున్నారన్నారు. పసుపు-కుంకుమ కింద టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెక్కులు ఇచ్చిందనీ, ఇప్పుడు మహిళలు బ్యాంకుల ముందు భారీ క్యూలైన్లలో నిలబడుతున్నారని చెప్పారు. కానీ బ్యాంకు అధికారులు నగదు లేదని తిప్పిపంపుతున్నారని గుర్తుచేశారు. టీడీపీ మోసాలన్నీ బట్టబయలు కాబోతోందని స్పష్టం చేశారు. పోలీస్ శాఖను చంద్రబాబు జేబు సంస్థగా మార్చేశారని దుయ్యబట్టారు.