‘జనసేన’ అభ్యర్థులకు క్లాస్ పీకిన పవన్ !

ఎన్నికలు జరిగిపోయి నాలుగురోజులు దాటిపోయిన నేపథ్యంలో నెమ్మదిగా పవన్ తమ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్ధులు అందర్నీ ఒకరి తరువాత ఒకర్ని పిలిచి వారితో ఏకాంత సమావేశాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ‘జనసేన’ కు ఎన్ని ఓట్లు పడి ఉంటాయి ఏ విషయంలో ఎన్నికలలో వెనకపడ్డాము అన్న విషయమై కూలంకష చర్చలు నిన్నటి నుండి పవన్ మొదలు పెట్టినట్లు టాక్.

జరిగిన ఎన్నికలలో ప్రధాన పార్టీలు అన్నీ ఓటుకు రెండువేలు పైనే ఖచ్చితంగా ఇవ్వవలసి వచ్చింది అని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇదే తరహా తీరు కొందరు ‘జనసేన అభ్యర్థులు కూడ ఆచరించారు అని వార్తలు రావడం పవన్ కు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. కొంతమంది ‘జనసేన’ అభర్ధులు కూడ ఎన్నికలలో ఓటుకు 1000 రూపాయల వరకు ఇచ్చినట్లు కొన్ని పత్రికలలో కథనాలు రావడం పవన్ కు చాలా కోపం కలిగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి అనే లక్ష్యంతో ఎన్నికలలో పోటీ చేసిన జనసేన అభర్ధులు కూడ ఇలా డబ్బు పంచిపెట్టినట్లుగా వార్తలు రావడం పవన్ కు షాక్ ఇచ్చినట్లు టాక్. అలా డబ్బు ఖర్చుపెట్టిన ‘జనసేన’ అభ్యర్ధులను పవన్ తన దగ్గరకు పిలిపించుకుని వారికి గట్టిగా క్లాస్ పీకినట్లు ఒక మీడియా సంస్థలో కథనాలు వస్తున్నాయి.

అంతేకాదు డబ్బుతో రాజకీయాలు చేసేవారు తన ‘జనసేన’ లో ఉండనక్కరలేదనీ అలాంటి అభ్యర్థులు ఒకవేళ ఎన్నికలలో గెలిచినా తనకు అవసరం లేదు అంటూ పవన్ పీకిన క్లాస్ కు ఆ అభ్యర్థులు షాక్ అయినట్లు సమాచారం. అయితే ప్రధాన రాజకీయ పార్టీలలోని నాయకులే ఏరోజు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థుతులలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో మూడు స్థానాలు కూడ గెలవడం కష్టం అని ప్రచారంలో ఉన్న ‘జనసేన’ పార్టీ అభ్యర్థులకు పవన్ ఇచ్చిన క్లాస్ తో ఎన్నికలు ఫలితాలు వచ్చాక పవన్ పార్టీలో ఉన్న ఆ కొద్దిమంది నాయకులు పవన్ క్లాసులు భరించలేక ‘జనసేన’ నుంచి వెళ్ళిపోతే ఖాళీ టీ గ్లాసులా ‘జనసేన’ ఖాళీ అయిపోతుందా అంటూ కొందరు పవన్ ఇచ్చే క్లాసుల పై సెటైర్లు వేస్తున్నట్లు టాక్..