టీడీపీ – వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

కృష్ణా: తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ముగిసినా ఇంకా ఎన్నికల వేడి మాత్రం తగ్గలేదు. ఫలితాలకు మరో నలభై రోజులు గడువు ఉండగా గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ఎన్నికల సమయంలో ఉన్న మనస్పర్థలు, చిన్న గొడవలు ఇంకా సమసిపోలేదు. తాజాగా కృష్ణా జిల్లా పెదపారుపూడి టీడీపీ-వైకాపా వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా వైసీపీ అభ్యర్థి అనిల్ నివాళులు అర్పిస్తుండగా గొడవ మొదలైంది. కొందరు టీడీపీ కార్యకర్తలు అనిల్ తమపై దాడి చేయించారని పోలీసులకు ఫిర్యాదు చేయగా తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ అనిల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగడంతో గొడవ కాస్త ఇంకాస్త ఉద్రిక్తతగా మారింది.