రాష్ట్రం ముందుకెళ్లాలంటే బాబు నాయకత్వం కావాలి:బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈరోజు కలిశారు. కొద్ది సేపటి క్రితం బైరెడ్డి, తన అనుచరులతో  చంద్రబాబు వద్దకు వెళ్లారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, విభజన తర్వాత ఏపీ క్లిష్ట పరిస్థితిలో ఉందని, ఇటువంటి రాష్ట్రాన్ని మరో ఐదేళ్లు కష్టపడి ముందుకు తీసుకెళితే తప్ప ప్రజలకు ఉపయోగం ఉండదని, అందుకే, చంద్రబాబుకే ఓటెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. 

ఈ నేపథ్యంలోనే చంద్రబాబును ఈరోజున తాను కలిసి మాట్లాడానని, ముఖ్యంగా, ఈ రాష్ట్ర పరిస్థితులు, కర్నూలు జిల్లా రాజకీయాల గురించి చర్చించినట్టు చెప్పారు. టీడీపీలో తనను చేరమని, ఏపీ అభివృద్ధికి అందరం కలిసి పాటుపడదామని తనతో చెప్పినట్టు తెలిపారు. చంద్రబాబు గొప్ప నాయకుడని, చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఉన్న సమర్థవంతమైన నాయకత్వానికి, తాను సీఎం కొడుకుని కనుక తనకు కూడా ముఖ్యమంత్రి అయ్యే అర్హతలున్నాయంటూ ముందుకొచ్చిన జగన్ నాయకత్వానికి మధ్య జరిగే ఎన్నికలివి అని అన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గురించో, మరొకరి గురించో మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు.