రంగాను హత్య చేయించింది టీడీపీయే ఎవరిని అడిగినా ఇదే చెబుతారు…..

విజయవాడలో బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలుగొందిన వంగవీటి రాధాను హత్య చేయించిన పార్టీలో ఆయన కుమారుడు రాధా చేరడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని రంగా సోదరుడు నారాయణరావు తనయుడు వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. రాధ చర్యతో రంగా అభిమానులంతా క్షోభకు గురయ్యారని, ఎవరూ సంతృప్తిగా లేరని అన్నారు.

ఈ ఉదయం విజయవాడలోని రాఘవయ్య పార్క్ సమీపంలో ఉన్న వంగవీటి రంగా విగ్రహం వద్దకు వచ్చి రాధ చర్యలకు నిరసనగా నరేంద్ర దీక్షకు దిగగా, కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీక్షకు కూర్చున్న నరేంద్రను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి పంపేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ, రంగా హత్యకు కారణం టీడీపీయేనని ఎవరిని అడిగినా చెబుతారని, అటువంటి పార్టీలో రాధా చేరడం బాధను కలిగిస్తోందని అన్నారు.

 గతంలో రంగా భార్య చేసిన తప్పునే నేడు రాధా కూడా చేస్తున్నాడని విమర్శించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి ఆశయాలను వదులుకున్న రాధను ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని నరేంద్ర అభిప్రాయపడ్డారు.