తొందరపడొద్దన్న లోకేష్…

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాలు పూర్తిగా మారుతున్నాయి..ముఖ్యంగా వైసీపీ లోకి వలసలు టీడీపీ పార్టీ నేతలను , కార్య కర్తలను నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకోగా..తాజాగా సీనియర్ నేత, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సైతం వైసీపీ లోకి చేరబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టడం అధిష్టాన్ని భయానికి గురి చేసింది.

నరసరావు పేట ఎంపీ స్థానం తనకు, సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం తన కుమారుడికి ఇవ్వాలని.. రాయపాటి అధిష్టానాన్ని కోరారు. అయితే, పార్టీ ఒప్పుకోకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయినట్లు తెలుస్తుంది. రాయపాటిని పక్కనబెట్టి.. భాష్యం రామకృ‌ష్ణ పేరును పరిశీలిస్తోందన్న ప్రచారం నేపథ్యంలో రాయపాటి ఇంకాస్త మనస్థాపానికి గురై..టీడీపీ రాజీనామా చేసి వైసీపీ లోకి వెళ్లాలని భావిస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ రాయపాటితో ఫోన్‌లో మాట్లాడారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. తప్పక న్యాయం జరుగుతుందని నచ్చజెప్పారట. మరి రాయపాటి అధిష్టానం మాట విని కాస్త తగ్గుతాడా…లేక వైసీపీ లోకి వెళ్తాడా అనేది చూడాలి.