చిరంజీవికి హైకోర్టులో ఊరట..కేసు రద్దు

అప్పట్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ చిరంజీవిపై గుంటూరు పోలీస్ స్టేషన్ లో 2014లో నమోదైన కేసును హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.రజనీ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. 2014 ఏప్రిల్‌ 27 రాత్రి 10 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేశారంటూ చిరంజీవిపై అధికారులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారమై దాఖలు చేసిన అభియోగపత్రాన్ని దిగువ కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోవడాన్ని సవాలు చేస్తూ చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు.
ప్రచారం ముగించుకొని తిరిగి వస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అక్రమంగా పిటిషనర్‌పై కేసు నమోదు చేశారన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. చిరంజీవిపై నమోదు చేసిన కేసును రద్దు చేశారు.