ఆంధ్రాలో ఐటీ సోదాల కలకలం..!

పన్ను ఎగవేత దారులే లక్ష్యంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఏకకాలంలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. రాష్ట్రంలోని పలు స్థిరాస్తి సంస్థలు, పరిశ్రమలు, రొయ్యల ఎగుమతి సంస్థలకు చెందిన కార్యాలయాలు టార్గెట్ గా ఈ తనిఖీలు సాగాయి. హైదరాబాద్‌లోని పలు చోట్ల కూడా తనిఖీలు జరిగాయి. నెల్లూరు జిల్లాలో తెదేపా నేత బీద మస్తాన్‌రావుకు చెందిన సంస్థల్లోనూ, ప్రకాశం జిల్లాలో కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన పరిశ్రమల్లోనూ, విశాఖలో నంబూరు శంకరరావు సంస్థల కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 చోట్ల తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.

వివిధ ప్రాంతాలనుంచి ఆదాయపు పన్ను శాఖకు చెందిన అధికారుల బృందాలు విజయవాడకు చేరుకున్నాయని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యులే లక్ష్యంగా సోదాలు జరిగే అవకాశం ఉందని ముందే మీడియాలో జోరుగా ప్రచారం సాగినప్పటికీ పన్ను ఎగవేత, అక్రమ లావాదేవీలు, అవినీతి వ్యవహారాలు, డొల్ల కంపెనీలు, అక్రమ పెట్టుబడులు తదితర ఆరోపణలపైనే ముఖ్యంగా ఈ దాడులు జరిపారని సమాచారం మీడియా దృష్టి తమ మీద ఎక్కువగా ఉండడంతో ఆదాయపు పన్ను శాఖాధికారులు వారిని దారి మల్లించడం కోసం వాహనాలు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకునేందుకు కొందరు మీడియా ప్రతినిధులు వెంబడించారు.

వారి దృష్టి మరల్చేందుకు వారు నారాయణ జూనియర్‌ కళాశాలలోకి వెళ్లారు. దీంతో మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయని ప్రచారం సాగింది.అయితే తమ విద్యాసంస్థలపై ఎక్కడా సోదాలు జరగలేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. భారీగా ఆర్థిక లావాదేవీలు జరిపిన సంస్థలపై తనిఖీల్లో బిల్లులు, లావాదేవీల వివరాలను పరిశీలించి ఆయా సంస్థల ప్రతినిధుల నివాసాలు, కార్యాలయాల నుంచి అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

సోదాల వివరాలను బయటపెట్టడానికి స్థానిక ఐటీ అధికారులు నిరాకరించారు. దాడులు పూర్తయిన తర్వాత సంబంధిత వివరాలను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం తెలియజేస్తుందని, ప్రస్తుతానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని రాష్ట్ర ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Post expires at 2:10pm on Saturday October 6th, 2018