బీసీ నాయకులకు గమ్యస్థానంగా జనసేన..!

జనసేన పార్టీ సిద్ధాంతమైన కులాల్ని కలిపే సిద్ధాంతానికి ఆకర్షితులై పశ్చిమలో బీసీ వర్గాలు జనసేన పార్టీ దారి పడుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు తామూ జనసేనతోనే అంటున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ, పెనుగొండ మాజీ ఎంపీపీ, మాజీ టీడీపీ రాష్ట్రస్థాయి నాయకుడు మల్లుల లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరారు. ఏలూరులో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో ఆయనతో పాటు సిద్ధాంతం సొసైటీ అధ్య క్షుడు కలగ ప్రసాద్‌ జనసేనలో చేరారు.

మల్లుల తెలుగుదేశంలో బలమైన నాయకుడిగా ఎదిగి రాష్ట్రస్థాయిలో పార్టీ పదవులు, ఎంపీపీ, ఎమ్మెల్సీగా పనిచేశారు. పెనుగొండ అసెంబ్లీ స్థానానికి గతంలో పోటీచేసి ఓటమి చవిచూశారు. తర్వాత వైసీపీలో చేరినా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా లేరు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మల్లుల చేరికతో ఆచంట నియోజకవర్గంలో జనసేనకు బలం లభించిందని జనసేన కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. పెనుగొండ మీదుగా ర్యాలీగా ఏలూరు వెళ్లి తన అనుచరులతో ఆయన జనసేనలో చేరారు.