దెందులూరులో చింతమనేనిని ఫుట్ బాల్ ఆడిన పవన్ కళ్యాణ్..!

ప్రజాపోరాటయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ నిన్న దెందులూరులో పర్యటించారు. సభకు హాజరైతే చంపేస్తానని స్థానిక శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ఎంతగా బెదిరించినప్పటికీ , ఫలితం లేకుండా పోయింది . ఊహించని స్థాయిలో జనం తరలి వచ్చారు .అశేష జనసందోహం నడుమ పవన్ కళ్యాణ్ ప్రసంగించారు . పవన్ ప్రసంగం ఆధ్యంతం చింతమనేని టార్గెట్ గానే సాగింది.

చింతమనేని ని ఉద్దేశించి మాట్లాడుతూ, సభను అడ్డుకుంటానని బెదిరించిన ఇటువంటి ఆకురౌడీ , పిల్లరౌడీ , చిల్లరరౌడీ , వీధి రౌడీలను ….. తాను 16 యేండ్ల వయసులోనే తన్ని తరిమేశానని పవన్ ఆక్రోశంగా అన్నారు .ఎంతోమంది గొప్పవారు ప్రాతినిధ్యం వహించిన చట్టసభల్లో నేడు , చింతమనేని లాంటి ఆకురౌడీలు కొలువుదీరడం బాధాకరం అన్నారు .

ముఖ్యంగా వనజాక్షిని కొట్టడం , ఎస్సీల మీద దౌర్జన్యం , వికలాంగుడైన బ్రాహ్మణ కుటుంబాన్ని విచక్షణా రహితంగా చావబాదడం లాంటి అంశాలను ప్రస్తావించారు . చింతమనేని పై 27 కేసులు రిజిస్టర్ అయున్నాయని , ఇటువంటి నేరగాడిని మీరు ప్రోత్సహించడం సిగ్గుచేటని చంద్రబాబు ను విమర్శించారు .నేరగాళ్ల పట్ల పోలీసు వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని , ఈ విధంగా చోద్యం చూడటం వలనే రాష్ట్రం లో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని పవన్ వాపోయారు .

ఎన్ని వందల ఎకరాలు చింతమనేని దోచుకున్నాడో , అక్రమ ఇసుక ఎంత తవ్వుకున్నాడో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు .డీజీపీ , హోంశాఖ సెక్రటరీ , వెస్ట్ గోదావరి ఎస్పీ కలెక్టర్ లకు చింతమనేని పై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు , మీరు చర్యలు తీసుకోని పక్షంలో ప్రజలే తేల్చుకుంటారని పవన్ హెచ్చరించారు . కత్తి గూండాలు పట్టుకుంటారని , దేశ సైనికులు కూడా పట్టుకుంటారని … శాంతికోసం మేముకూడా కత్తి పట్టుకోవలసి ఉంటుందని , కవి శివారెడ్డి కవితను ఉటంకించారు.ఆకురౌడీలకే ఇంత తెగింపుంటే , దేశాన్ని ప్రేమించే సైనికులం మాకెంత తెగింపుండాలని అన్నారు .

జనసేన లక్ష్యం రౌడీలను , గూండాలను తరిమికొట్టి , శాంతియుత పరిపాలన అందించడమే అన్నారు. జనసేన కార్యకర్తలకు ప్రభుత్వ సహాయం ఉపసంహరించడంపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మీకు అధికారం లేకుండా చేస్తామని చంద్రబాబును హెచ్చరించారు.అసెంబ్లీకి వెళ్లి టీడీపీ అవినీతి, అరాచకాలపై పోరాడాలని జగన్ కు సూచించారు .