టెలికాం కంపెనీలకు షాక్ ..!

96

టెలికాం కంపెనీలకు సర్వోన్నత న్యాయస్ధానం నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సర్దుబాటు చేసిన స్ధూల రాబడి (ఏజీఆర్‌)పై బకాయిల చెల్లింపుల కోసం నూతన షెడ్యూల్‌ను ప్రకటించాలని కోరుతూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల్లో విఫలమైన టెలికాం కంపెనీలపై కఠిన చర్యలు ఎందుకు చేపట్టలేదని టెలికాం శాఖను తీవ్రంగా మందలించింది.భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలపై కోర్టు ధిక్కరణ అభియోగాలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. బకాయిల చెల్లింపులపై ఒత్తిడి చేయరాదని కోరుతూ అటార్నీ జనరల్‌కు లేఖ రాసిన టెలికాం శాఖ డెస్క్‌ అధికారిపైనా సుప్రీంకోర్టు మండిపడింది. తనపై ఎందుకు చర్య తీసుకోరాదో వివరించాలని కోరుతూ ఆ అధికారికి కోర్టు ధిక్కరణ నోటీసును జారీ చేసింది.ఏజీఆర్‌ చెల్లింపులపై పలుసార్లు ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు చెల్లింపులు చేపట్టలేదో మార్చి 17న కోర్టుకు హాజరై వివరించాలని, వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టకూడదో తెలపాలని భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఇండియా సహా టెలికాం కంపెనీల ఎండీ, డైరెక్టర్లందరికీ సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది.