అసెంబ్లీ సిత్రాలు..!

21

ఏపీలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. వైసీపీ,టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రణరంగాన్ని తలపించేలా మూడు రాజధానుల అంశంపై ఉత్కంఠ నెలకొంది. శాసనసభలో ఈ బిల్లు ఆమోదం పొందడంతో మండలికి చేరింది. సభ్యుల దృష్టి అంతా దానిపై ఉంది. ఏం జరుగుతుందో అని ఎమ్మెల్యేలు అంతా గ్యాలరీల్లోకి చేరిపోయారు. ఇలా చర్చ జరుగుతున్న సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు పోటీ పడి సెల్పీ తీసుకోవడంతో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. 

ఉత్కంఠగా సాగుతున్న సమావేశాలను చూసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు వైసీపీ,టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు మండలి గ్యాలరీల్లో కూర్చున్నారు. ఈ సమయంలో అక్కడ కొత్త సినిమా కోసం లుక్ మార్చిన బాలయ్య వైసీపీ ఎమ్మెల్యేలకు కనిపించారు. ఇంకేముందు వెంటనే అంతా కలిసి ఆయన వద్దకు వెళ్లి సెల్ఫీకి ఫోజు ఇచ్చారు. ముఖ్యంగా రోజా, కాసు మహేశ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అబ్బయ్య చౌదరి, వసంత కృష్ణప్రసాద్ అంతా కలిసి బాలకృష్ణతో సెల్ఫీలు దిగారు. ఇదంతా జరుగుతున్న సమయంలో చంద్రబాబు బాలయ్య పక్కనే కూర్చొని ఉన్నారు. సభలో నేతలు ఒకరిపై ఒకరు విరుచుకుపడి గ్యాలరీల్లోకి చేరుకునే సరికి ఇలా సరదాగా ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఈ సెల్పీ హాట్ టాపిక్‌గా మారిపోయింది.