బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు..!

తమిళనాడులో 2ఏళ్ల బాలుడు బోరు బావిలో పడ్డాడు. తిరుచిరాపల్లి జిల్లా నడుకట్టుపట్టి గ్రామంలో శుక్రవారం సాయంత్రం 5.30గంటల సమయంలో బోర్ బావి దగ్గరకు వెళ్లిన సుజీత్ విల్సన్ అనే బాలుడు.. ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్.. సుజీత్‌ను బయటకు తెచ్చేందుకు గంటలుగా సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం అతడు 68 అడుగుల లోతులో ఉన్నట్లు తెలుస్తోంది. బాలుడికి ఆక్సిజన్ అందుతుండంతో కదలిక ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అరకోణం నుండి మూడు ప్రత్యేక ఏన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఈ సహాయక చర్యలలో పాల్గొన్నాయి. అలాగే ఆరోగ్య మంత్రి విజయభాస్కర్, పర్యావరణ మంత్రి నటరాజన్, జిల్లా కలెక్టర్ శివరసు, ఎస్పీ జౌల్ హక్ అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు బాలుడిని క్షేమంగా కాపాడాలని రాష్ట్ర వ్యాప్తంగా #savesujith, #PrayforSujith పేరుతో నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.