జొమాటోలో తగిన ఆఫ‌ర్లు

128

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలు తమ వినియోగదారులకు ఇచ్చే ఆఫర్లను పునః​సమీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాయి. రెస్టారెంట్‌ అసోసియేషన్‌తో చర్చల అనంతరం అవి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆన్‌లైన్‌ కంపెనీలు తమ వినియోగదారులకు ఇచ్చే భారీ ఆఫర్లతో తమ లాభాలు కుంచించుకుపోయాయంటూ కొన్ని రెస్టారెంట్లు తీవ్ర నిరసనను తెలియజేశాయి. దాదాపు 1800 రెస్టారెంట్లు ఆన్‌లైన్‌ కంపెనీలతో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఆగస్టు 15 నుంచి ఆర్డర్లను నిరాకరించాయి. ఆర్డర్లను నిలిపివేయడంపై జరిమానా చెల్లించాలని జొమాటో పంపిన నోటీసులపై రెస్టారెంట్లు తీవ్రంగా స్పందించాయి. దీంతో దిగి వచ్చిన ఆన్‌లైన్‌ కంపెనీలు వీటితో చర్చలు ప్రారంభించాయి. వీటిలో ముఖ్యమైన జొమాటో రెస్టారెంట్లతో నడుస్తోన్న వార్‌లో కాస్త వెనక్కి తగ్గింది.

జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌.. తమ తప్పులేమైనా ఉంటే సరిదిద్దుకుంటామని రెస్టారెంట్లను ట్వీట్‌ ద్వారా కోరారు. తమ వినియోగ దారులకు ఇచ్చే గోల్డ్‌ మెంబర్‌షిప్‌పై పునరాలోచన చేస్తున్నామని తెలిపారు. మనం కలసి వినియోగదారునికి ఆమోదయోగ్యమైన రీతిలో ధరలను నిర్ణయిద్దామని కోరారు. దీనిపై నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు రాహుల్‌సింగ్‌ మాట్లాడుతూ పోటీవేటలో పడి తమ రెస్టారెంట్ల ఆదాయం గణనీయంగా పడిపోయిందని వాపోయారు. ఆన్‌లైన్‌ కంపెనీలతో చర్చల ద్వారా రెస్టారెంట్‌ పరిశ్రమను రక్షించాలని నిర్ణయించాం అని తెలిపారు. డిస్కౌంట్లు అసంబద్దంగా ఉన్నాయని, ఆన్‌లైన్‌ కంపెనీలు వినియోగదారుల నుంచి పొందే ఆదాయాన్ని రెస్టారెంట్లతో పంచుకోవడం లేదని అన్నారు.

జొమాటో గోల్డ్ ప్రొగ్రామ్.. తమ వినియోగదారులకు పెయిడ్ మెంబర్‌షిప్ ప్రొగ్రామ్. దీన్ని 2017 నవంబర్‌ నెలలో ప్రారంభించింది. ఈ ప్రొగ్రామ్ కింద ఫుడ్, డ్రింక్స్‌పై వన్ ప్లస్ వన్ ఆఫర్ వంటి డీల్స్‌ను అందిస్తోంది. ఇది లాంచ్ అయినప్పటి నుంచి రెస్టారెంట్లకు ఆదాయం పడిపోయింది. జొమాటో గోల్డ్‌లో జాయిన్ అయిన కొన్ని రెస్టారెంట్లు దెబ్బతిన్నాయి. మరోవైపు ఫుడ్ సర్వీసెస్ ధరలు ఇంకా తగ్గాలని గోయల్ కోరుతున్నారు. ఇప్పుడీ తాజా చర్చలతో ఆన్‌లైన్‌ ఆహార ధరలు పెరగడం ఖాయమని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.