భారతీయురాలిని పెళ్లాడిన పాక్ క్రికెటర్

83

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ భారతీయ యువతి షామియా అర్జూను పెళ్లాడాడు. దుబాయ్ లో నిన్న వీరి వివాహం జరిగింది. తమ వివాహం గురించి 25 ఏళ్ల హసన్ అలీ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన బ్యాచిలర్ జీవితానికి ఇదే చివరి రాత్రి అని ట్వీట్ చేశాడు. ఎడారి మధ్యలో నిర్వహించిన మెహిందీ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కూడా అప్ లోడ్ చేశాడు. మరోవైపు, హసన్ అలీకి ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. ‘కంగ్రాట్ హసన్ అలీ. మీరిద్దరూ జీవిత కాలం సంతోషంగా, ప్రేమాభిమానాలతో ఉండాలి.’ అని ట్వీట్ చేసింది. తన వివాహానికి ఇండియన్ క్రికెటర్లను కూడా హసన్ అలీ ఆహ్వానించాడు. తన పెళ్లికి ఇండియన్ క్రికెటర్లు కూడా వస్తే తనకు మరింత సంతోషంగా ఉంటుందని తెలిపాడు. హసన్ అలీ భార్య షామియా హర్యానాకు చెందిన యువతి. ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ లో ఆమె ఫ్లైట్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. ఆమె కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది.