కుక్కల్ని ఆమె సరిగా చూసుకోవట్లేదనీ…

అమెరికా… ఫ్లోరిడాకి చెందిన 26 ఏళ్ల జొనాథన్ స్టోక్స్‌ని పోలీసులు అరెస్టు చేశారు. అతను చేసిన ఘనకార్యం ఏంటంటే… తన గర్ల్‌ఫ్రెండ్‌తో శృంగారంలో పాల్గొన్న వీడియోని స్నాప్‌చాట్‌లో అప్‌లోడ్ చేశాడు. ఎందుకిలా చేశావని అడిగితే… అతను చెప్పిన సమాధానం పోలీసుల్ని ఆశ్చర్యపరిచింది. తను ఊరు వెళ్లినప్పుడు తన పెంపుడు కుక్కలను గర్ల్‌ఫ్రెండ్ సరిగా చూసుకోలేదని అన్నాడు. ఆమెపై కోపంతోనే ఇలా చేశాననడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఈ మొత్తం వివాదంపై ఆమె కోర్టుకు వెళ్లడంతో… రంగంలోకి దిగిన పోలీసులు జొనాథన్‌ను అరెస్టు చేశారు. నిజానికి ఆ వీడియోని ఆమె అనుమతితోనే షూట్ చేశాడు జొనాథన్. ఐతే… దాన్ని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు.

ఊరి నుంచీ వచ్చిన జొనాథన్… తన కుక్కల్ని ఎందుకు సరిగా చూసుకోలేదని స్నాప్‌చాట్‌లో ఆమెను ప్రశ్నించాడు. ఊరు వెళ్లే ముందు నాకు అలా చెప్పలేదు కదా అని ఆమె ప్రశ్నించింది. అంతే… ఆమెను అడ్డమైన తిట్లు తిడుతూ పోస్టులు పెట్టాడు. ఆ తర్వాత కోపం పట్టలేక… ఏకంగా బూతు వీడియోని పోస్ట్ చేశాడు. షాకైన ఆమె… పోలీసుల్ని ఆశ్రయించింది.

పోలీసులు మొదట కలిసినప్పుడు… ఆ వీడియోకీ తనకూ సంబంధం లేదని బుకాయించాడు జొనాథన్. దాన్ని వెంటనే డిలీట్ చేశాడు. పోలీసులు ఊరుకుంటారా… నాలుగు తగిలించారు. అప్పుడు నిజం ఒప్పుకున్నాడు. తనే అప్‌లోడ్ చేశానన్నాడు. మరి ఎందుకు డిలీట్ చేశావని అడిగితే… ఎవరో ఫ్రెండ్ డిలీట్ చెయ్యమని సలహా ఇస్తే, చేశానన్నాడు.

సెక్సువల్ సైబర్ హెరాస్‌మెంట్ (లైంగిక సైబర్ వేధింపులు) లేదా రివెంజ్ పోర్న్ కింద జొనాథన్‌ని అరెస్టు చేసిన పోలీసులు… కొన్ని గంటల తర్వాత అతన్ని రిలీజ్ చేశారు. రూ.1,02,814 బాండ్ రాయించుకున్నారు. ఈ కేసులో… ఆగస్ట్ 20న అతను కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది.