బాసర ట్రిపుల్ ఐటీలో కీచక ప్రొఫెసర్..

విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువు కీచకుడి అవతారమెత్తాడు. చదువుల తల్లి సరస్వతి దేవి కొలువైన నిర్మల్ జిల్లాలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థినుల జీవితాలను ఆగం చేసే ప్రయత్నం చేశాడు. ఫెయిల్ అయిన విద్యార్థినులే టార్గెట్‌గా వారిని ఇబ్బందులు పెట్టాడు. చివరకు పాపం పండింది. అమ్మాయిల సెల్‌ఫోన్లకు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ వేధిస్తున్న ఆ కీచకుడు అడ్డంగా దొరికిపోయాడు. విచారణలో వాస్తవాలు బయటపడినా అధికారులు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం విశేషం.

నిజామాబాద్‌కుచెందిన వరాల రవి బాసర ట్రిపుల్ ఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వరాల రవి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ హెచ్ఓడీ అయిన ఆయన ఫెయిల్ అయిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకునేవాడు. వారి సెల్‌ఫోన్లకు అసభ్యకరమైన సందేశాలతో పాటు తన ఇంటి అడ్రస్ పంపుతూ వారిని ఇబ్బందుల పాటు చేశాడు. తాజాగా మరోసారి వేధింపులకు పాల్పడిన రవి వ్యవహారం హాస్టల్ వార్డెన్ దృష్టికి రావడంతో ఆమె పై అధికారులకు సమాచారం ఇచ్చింది.

పీయూసీ 2 సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఓ అమ్మాయి క్యాంపస్‌కు వచ్చింది. ఎగ్జామ్స్ అనంతరం శనివారం ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. నిబంధనల ప్రకారం ఔట్‌ పాస్ తీసుకోవాల్సి ఉండటంతో వార్డెన్ సదరు బాలిక తండ్రితో మాట్లాడించాలని చెప్పింది. ఆ సమయంలో అమ్మాయి ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లు చూసిన వార్డెన్ షాకైంది. కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ హెచ్ఓడీ రవి ఆ మెసేజ్‌లు పంపినట్లు గుర్తించిన వార్డెన్ వాటిని తెరిచి చూడగా.. నిజామాబాద్‌లో ఉన్న తన ఇంటికి రావాలని అయి వస్తే ఆ అమ్మాయిని ఎగ్జామ్‌లో పాస్ చేయిస్తానని తన అడ్రస్ కూడా పంపాడు. దీనిపై సదరు యువతిని ప్రశ్నించగా.. రవి నుంచి గతంలో కూడా అసభ్యకరమైన సందేశాలు వచ్చినట్లు చెప్పడంతో వార్డెన్ వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. యువతితో పాటు ఆమె తల్లిదండ్రులను పిలిపించి వారి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అటు కీచక ప్రొఫెసర్ రవి వివరణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

రవి భాగోతం బయటపడటంతో ట్రిపుల్ ఐటీ అధికారులు శనివారం అత్యవసరంగా సమావేశమయ్యారు. వర్సిటీ వీసీకి సమాచారం ఇవ్వడంతో పాటు రవిపై అంతర్గత విచారణ జరపాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే తన భాగోతం బయటపెట్టిన వార్డెన్‌తో పాటు ఉన్నతాధికారులను రవి బెదిరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంత జరిగినా రవిపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రవిపై గతంలో క్వశ్చన్ పేపర్ లీకేజీ ఆరోపణలు వచ్చాయి. అయినా ఉన్నతాధికారులెవరూ ఆయనపై చర్య తీసుకోకపోవడం గమనార్హం.