కర్ణాటకలో 15 మంది ఎమ్మెల్యేల రాజీనామా..

కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు రాజీనామా చేశారు. ఇప్పటి వరకు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామా చేయడం లేదనే అనుకున్నారు. కానీ, సీఎం కుమారస్వామి లేకపోవడంతో ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా తమ రాజీనామాను సమర్పించారు. శనివారం 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విధానసౌధకు చేరుకున్నారు. స్పీకర్ రమేష్ కుమార్‌ను కలిసేందుకు వచ్చారు. ఆ 11 మందిలో ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు కాగా, ఎనిమిది మంది కాంగ్రెస్ సభ్యులు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రమేష్ జరాకీహోలీ, రామలింగారెడ్డి, మహేష్ కుమతల్లి, శివరామ్ హెబ్బర్, బీసీ పాటిల్, మునిరత్న, ఎస్టీ సోమశేఖర్, బైరాతి బసవరాజ్, సౌమ్య రెడ్డి, ప్రతాప్ గౌడ్ పాటిల్ రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు నారాయణ గౌడ, గోపాలయ్య, హెచ్.విశ్వనాథ్ కూడా అదే బాటలో నడిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ గత సోమవారమే రాజీనామా చేశారు.

తాజా రాజీనామాలతో జేడీఎస్ – కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల సంఖ్య 105కి పడిపోయింది. అందులో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు బీజేపీ సంఖ్యాబలం కూడా 105. కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం మేజిక్ ఫిగర్ 103. ఒకవేళ కుమారస్వామి ప్రభుత్వం నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. కర్ణాటకలో జరుగుతున్న పొలిటికల్ హైడ్రామాపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిపెట్టింది. రాజీనామా చేసే ఎమ్మెల్యేలతో మాట్లాడాల్సిందిగా మంత్రి డీకే శివకుమార్‌ను ఆదేశించింది. దీంతో ఆయన రంగంలోకి దిగారు. విధానసౌధకు చేరుకుని అక్కడ రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే, ఆయనకు నిరాశే ఎదురైనట్టు సమాచారం.

ఎమ్మెల్మేలు రాజీనామా లేఖలతో తన ఛాంబర్‌కు పోటెత్తుతుండడంతో ఆ విపత్తు నుంచి బయటపడేందుకు స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ ప్రయత్నించారు. రాజీనామాలతో వచ్చిన ఎమ్మెల్యేలకు అందుబాటులోకి రాలేదు. దీంతో స్పీకర్ ఛాంబర్ వద్ద గంటసేపటికి పైగా నిరీక్షించిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత రాజీనామాలతో గవర్నర్‌ను వాజుభాయ్ వాలాను కలిసేందుకు రాజ్‌భవన్ వెళ్లారు. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండురావ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వర్కింగ్ ప్రెసిండెట్ ఈశ్వర్ ఖాండ్రే పరిస్థితిని చక్కదిద్దేందుకు సమావేశాలు జరుపుతున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కుమారస్వామి.. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం గురించి తెలిసిన వెంటనే తిరుగు ప్రయాణం అయ్యారు. ఆదివారం సాయంత్రానికి కుమారస్వామి బెంగళూరు చేరుకునే అవకాశం ఉన్నట్టు జేడీఎస్ వర్గాలు చెబుతున్నాయి.