నెల్లూరులో ట్రెండీ వెడ్డింగ్‌ కార్డ్‌..!

సార్వత్రిక, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 23వ తేదీన వెలువడే ఫలితాల కోసం ప్రజలంతా ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. అదే రోజు (గురువారం)న శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలుచోట్ల భారీగా వివాహాలు జరగనున్నాయి. జిల్లా కేంద్రానికి చెందిన ఓ దుస్తుల దుకాణం యజమాని బయ్యా వాసు కూడా తన కుమార్తె వివాహాన్ని ఉదయం 11.51 గంటలకు వైభవంగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పరిణయ వేడుకకు హాజరయ్యే అతిథులకు ఎప్పటికప్పుడు తాజా వివరాలతో కూడిన సమాచారాన్ని అందించేందుకు గాను కల్యాణ మండపంలోనే ప్రత్యక్ష ప్రసారం ఏర్పాట్లూ చేపట్టారు. ఈ విషయాన్ని బంధుమిత్రులందరికీ ముందుగా తెలియచేయాలనే ఉద్దేశంతో శుభలేఖలో సంబంధిత సమాచారాన్ని ప్రత్యేకంగా ముద్రించారు. ప్రస్తుతం ఈ శుభలేఖ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.