కాల్ సెంటర్ పేరుతో 15 వేల మందిని ముంచాడు !

న్యూయార్క్ : డబ్బు సంపాదన కోసం జనం తెలివిమీరి పోతున్నారు. కోట్లు సంపాదించాలన్న ఆశతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఇలాగే వక్రమార్గం పట్టిన ఓ కేటుగాడు భారత్ కేంద్రంగా అమెరికన్ల నుంచి కోట్లు కొల్లగొట్టాడు. పాపం పండటంతో ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు.

గుజరాత్‌కు చెందిన హితేశ్ మధుభాయ్ పటేల్ అహ్మదాబాద్‌లో హెచ్ గ్లోబల్ సర్వీస్ పేరుతో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు. 2012లో ప్రారంభించిన ఈ కాల్ సెంటర్ ద్వారా నిందితుడు అమెరికాలో నివాసముంటున్న దక్షిణాసియావాసులే లక్ష్యంగా మోసాలకు తెరతీశాడు. ప్లాన్ ప్రకారం టెలీకాలర్లు బాధితులకు ఫోన్ చేసి యూఎస్ ట్యాక్స్, ఇమ్మిగ్రేషన్ అధికారులుగా పరిచయం చేసుకునేవారు. రుణాలు, పన్నులు ఎగ్గొట్టారంటూ బాధితులను బెదిరించేవారు. చివరకు కొంత మొత్తం చెల్లిస్తే కేసులు పెట్టమని సలహా ఇవ్వడంతో బాధితులు వారి మాటలు నమ్మి వారు అడినంత ముట్టజెప్పేవారు.

బాధితుల నుంచి డెబిట్ కార్డులు, వైర్ ట్రాన్స్‌ఫర్ ద్వారా హితేశ్ సొమ్ము రాబట్టేవాడు. అలా వచ్చిన మొత్తాన్ని వెంటనే మనీలాండరింగ్ ద్వారా దేశం నుంచి తరలించేవాడు. ఇలా 2012 నుంచి హితేశ్ దాదాపు 520 కోట్ల మేర కొట్టేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.

ఆరేళ్లలో దాదాపు 15వేల మందిని మోసం చేసిన హితేశ్‌ బండారం బయటపడటంతో గతేడాది భారత్ నుంచి సింగపూర్ పారిపోయాడు. అమెరికా అభ్యర్థన మేరకు సింగపూర్ పోలీసులు 2018 సెప్టెంబర్ 21న అతన్ని అరెస్ట్ చేశారు. తదుపరి న్యాయప్రక్రియ పూర్తి చేసి ఈ ఏడాది మార్చి 25న హితేశ్‌ను అమెరికాకు అప్పజెప్పారు. నిందితున్ని శనివారం కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ వచ్చే బుధవారానికి వాయిదా పడింది.