30 మందిని కాపాడి ప్రాణాలు వదిలింది

శునకాన్ని విశ్వాసానికి మారుపేరుగా భావిస్తుంటారు. నమ్మిన వారి కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని నైజం వాటిది. అందుకే ఎక్కువమంది శునకాలనే పెంచుకుంటారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ శునకం ఏకంగా 30 మందిని కాపాడి తాను ప్రాణాలు విడిచింది. 

లక్నోలోని ఓ భవంతిలో సుమారు 30 మంది వరకు నివసిస్తున్నారు. ఆ ఇంటి యజమాని కుక్కను పెంచుకుంటున్నారు. గురువారం అర్థరాత్రి అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదాన్ని పసిగట్టిన శునకం గట్టిగా అరవడంతో అందరూ మేల్కొన్నారు. అప్పటికే మంటల తీవ్రత పెరగసాగింది. దీంతో అందులోని వారంతా పరుగులు పెడుతూ బయటకు వచ్చేశారు. అదే సమయంలో ఓ గదిలోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ కుక్క ప్రాణాలు విడిచింది. దాన్ని కాపాడేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 

ఈ ఘటనలో అందరూ కంటతడి పెట్టారు. తమను రక్షించిన శునకం ప్రాణాలు కోల్పోవడం వారిని కలిచి వేస్తోంది. ఏకంగా 30 మందిని రక్షించిన ఆ శునకం ఇప్పుడు లక్నోలో హీరోగా మారిపోయింది. దాని త్యాగాన్ని అందరూ కొనియాడుతున్నారు.