ప్రాణాలు తీస్తున్నా పబ్జీ గేమ్…

సిద్దిపేట: పబ్జీ గేమ్.. ఇటీవల బాగా వినిపిస్తున్న.. కనిపిస్తున్న గేమ్ ఇది. ప్రస్తుతం చాలా మంది యువతీ యువకులు ఈ గేమ్ మత్తులో పడిపోతున్నారు. ఎప్పుడూ చేతిలో సెల్ పట్టుకుని పిచ్చి వాళ్లలా ప్రవర్తిస్తున్నారు. ఈ గేమ్‌కు బానిసలవ్వద్దు అంటూ అటు వైద్యులు, ఇటు నిపుణులు చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా పబ్జీ మోజులో పడి చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇదే గేమ్‌కు బానిసలా మారిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో జరిగింది.

మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం మల్లాపూర్‌కు చెందిన శేషత్వం వెంకటనారాయణ- శారద దంపతుల చిన్న కుమారుడు సాయిచరణ్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, అతడు కొన్ని రోజులుగా పబ్జీ గేమ్‌కు అలవాటు పడి చదువును నిర్ణక్ష్యం చేస్తున్నాడు. గమనించిన తల్లిదండ్రలు అతడిని మందలించారు. అయినా, అతడు వారి మాటను వినలేదు. దీంతో గేమ్ ఆడవద్దంటూ గట్టిగా చెప్పారు.

దీంతో మనస్థాపానికి గురైన సాయిచరణ్.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కొడుకు గదిలో ఏం చేస్తున్నాడోనన్న అనుమానంతో వచ్చి చూసే సరికి సాయిచరణ్ ఫ్యాన్‌కు వెలాడుతూ కనిపించాడు. పక్కింటి వారి సాయంతో తలుపులు పగలకొట్టి అతడిని బయటికి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే సాయిచరణ్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.